Bhagavanth Kesari: బాలకృష్ణ 'భగవంత్ కేసరి'పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

Bhagavanth Kesari Anil Ravipudi comments on Balakrishna movie
  • తాను ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్‌ కేసరి’ ఒకటన్న అనిల్ రావిపూడి
  • సినిమా విడుదల సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నారన్న అనిల్
  • ఆ సమయంలో అభిమానుల్లో నిరాశ కనిపించిందని వెల్లడి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రోజుకో కొత్త రికార్డును సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ రావిపూడి, తాను గతంలో దర్శకత్వం వహించిన ‘భగవంత్‌ కేసరి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. నా కెరీర్‌లో ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్‌ కేసరి’ ఒకటి. కానీ, ఆ సినిమా ఇంకా పెద్ద హిట్‌ కావాల్సింది. సినిమా విడుదలైన సమయంలో చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం వల్ల బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించి హిట్‌ చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే ఈ చిత్రానికి మరింత గొప్ప స్పందన వచ్చేది’’ అని అనిల్‌ అన్నారు.


అలాగే, విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్‌’ సినిమా స్క్రిప్ట్‌కు తాను సహాయం చేసిన తర్వాత, ఆ సమయంలో ఉన్న నిరాశ నుంచి కొంతవరకు బయటపడ్డానని కూడా అనిల్‌ రావిపూడి తెలిపారు. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్‌ కేసరి’ 2023 అక్టోబర్‌ 19న విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు, ఈ చిత్రం 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోవడం విశేషం.

Bhagavanth Kesari
Balakrishna
Anil Ravipudi
Chiranjeevi
Jana Nayagan
Telugu cinema
Tollywood
Chandrababu Naidu
National Film Awards
MSV Garu

More Telugu News