వరంగల్ డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు

  • వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఆకస్మికంగా సోదాలు చేస్తున్న ఏసీబీ
  • గత నెలలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం
  • మంచిరేవులలోని ఆయన ఇంట్లోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు
వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గత నెలలో లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.

ఆ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయనను ప్రశ్నించగా, భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచిరేవులలోని ఆయన ఇంట్లోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హనుమకొండ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం సుమారు రూ.60 వేలు లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయన నివాసంలో జరిగిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అంతే కాకుండా, గతంలో నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో కూడా వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో కీలకమైన పత్రాలు, విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


More Telugu News