నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్

  • తన తప్పు లేకపోయినా తనను విమర్శిస్తున్నారన్న రేణు
  • నేను నమ్మే భగవంతుడికే నా బాధ చెప్పుకుంటానని వ్యాఖ్య
  • వీధి కుక్కల విషయంలో తన పోరాటం కొనసాగుతుందన్న రేణు

వీధి కుక్కలను చంపడంపై గళమెత్తిన నటి రేణూ దేశాయ్‌ మరోసారి భావోద్వేగంగా స్పందించారు. తనను కాపాడటానికి ఎవరూ లేరంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయని, అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేణు స్పష్టం చేశారు.


కాశీలో గంగానదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఆమె, ‘‘నన్ను కాపాడటానికి అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. అయినా నా తప్పు లేకపోయినా ఎంతోమంది నన్ను విమర్శిస్తున్నారు. వాటికి తిరిగి సమాధానం చెప్పే ఉద్దేశం నాకు లేదు. నేను నమ్మే భగవంతుడికే నా బాధ చెప్పుకుంటాను. ఆయన నా ప్రార్థనలు వింటాడన్న విశ్వాసం ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వస్తానో ఇప్పుడు అర్థమవుతుందేమో’’ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.


అలాగే వీధి కుక్కల విషయంలో తన పోరాటం కొనసాగుతుందని రేణూ మరోసారి స్పష్టం చేశారు. ‘‘నేను ఎప్పుడూ నా వ్యక్తిగత హక్కుల కోసం పోరాడలేదు. కానీ, కొన్ని కుక్కల తప్పు కారణంగా వందల సంఖ్యలో వాటిని చంపడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకునే వరకూ నా పోరాటం ఆగదు’’ అని తేల్చిచెప్పారు.


తాను ఒక రాజకీయ పార్టీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. తనకు అలాంటి ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టతనిస్తూ, ఇది పూర్తిగా జంతు హక్కుల కోసం చేస్తున్న పోరాటమేనని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.




More Telugu News