ఫుకెట్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం.. భారత యువకుడి అనుమానాస్పద మృతి

  • థాయ్‌లాండ్‌లో భారత యువకుడి మిస్టరీ డెత్ 
  • మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిన 28 ఏళ్ల జైన్ సాక్షమ్‌గా గుర్తింపు
  • శరీరంపై ఎలాంటి గాయాలు లేవంటున్న పోలీసులు
  • స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న భారత రాయబార కార్యాలయం
థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లో ఓ భారతీయ యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. మృతుడిని 28 ఏళ్ల జైన్ సాక్షమ్‌గా గుర్తించారు. ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన తర్వాత ఈ నెల 18న తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో మృతికి గల కారణాలు అంతుచిక్కడం లేదు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం ఫుకెట్‌లోని చెర్ంగ్ తలే ప్రాంతంలో జరిగిన 'ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్' అనే మూడు రోజుల మ్యూజిక్ ఫెస్టివల్‌కు జైన్ సాక్షమ్ హాజరయ్యాడు. కార్యక్రమం ముగిశాక, సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ పికప్ ట్రక్ ఎక్కి, చుట్టుపక్కల పార్క్ చేసిన కొన్ని వాహనాలను ధ్వంసం చేశాడు.

అతని పరిస్థితిపై ఆందోళన చెందిన అత్యవసర సిబ్బంది వెంటనే అతడిని థాలాంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేసరికి అతను షాక్‌లో ఉన్నాడని, కాసేపటికే స్పృహ కోల్పోయాడని వైద్యులు తెలిపారు. చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ, అతను మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై ఎలాంటి గాయాలు లేదా దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు.

దీంతో మృతికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు వచిరా ఫుకెట్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్‌కు ఆదేశించారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం లేదా ఏవైనా ఆరోగ్య సమస్యలు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం థాయ్‌లాండ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. పోస్ట్‌మార్టమ్ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.


More Telugu News