ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కేటాయించిన భూములపై చర్యలు తీసుకుంటాం: గుడివాడ అమర్నాథ్

  • విశాఖ భూములను పప్పు బెల్లాల్లా పంచారని అమర్నాథ్ ఆగ్రహం
  • రాజకీయ మార్కెటింగ్ లో చంద్రబాబు యూనిక్ పీస్ అని ఎద్దేవా
  • వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని వ్యాఖ్య

“అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు చంద్రబాబు ఆంధ్రజ్యోతికి భూములు కేటాయించారు” అని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలు సంతోషంగా లేరని, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు కూటమి నేతలు దావోస్‌ లో చెప్పుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.


ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇష్టానుసారంగా భూములు కేటాయించారని ఆరోపించిన అమర్నాథ్‌... తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆ భూ కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనల ప్రకారం భూ కేటాయింపు జరపాలని కోర్టు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాల్లా పంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌, ఔటర్ రింగ్ రోడ్‌, హైదరాబాద్ నగరం, భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ వంటి ప్రాజెక్టులను తనవేనని చంద్రబాబు చెప్పుకోవడం క్రెడిట్ చోరీకేనని అన్నారు. దావోస్ పర్యటన చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌ తో కాకుండా టీడీపీ బ్యాండ్ మేళంతో జరిగిందని, అక్కడికి వెళ్లి రాజకీయ ప్రచారమే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి దావోస్ వెళ్లి సొంత డప్పు కొట్టుకోవడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ కు నష్టం అని అన్నారు.

వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని, ఎన్టీఆర్ పేరుతోనే వారు రాజకీయంగా నిలబడ్డారని విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతూ, వాటిని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.





More Telugu News