Vemula Prashanth Reddy: రూ. 1,600 కోట్ల బొగ్గు గనుల విషయంలో రేవంత్, మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయి: వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy alleges differences between Revanth Reddy and ministers
  • కాంట్రాక్టుల్లో అవినీతిని బయటపెట్టినందుకే హరీశ్ రావును టార్గెట్ చేశారన్న వేముల
  • సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వేధిస్తున్నారని మండిపాటు
  • దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని నడుపుతోందని విమర్శ

సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన భారీ అవినీతిని బయటపెట్టినందుకే మాజీ మంత్రి హరీశ్‌ రావును టార్గెట్ చేసి సిట్ నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కావాలనే హరీశ్‌ రావును వేధిస్తున్నారని అన్నారు.


అసెంబ్లీ వేదికగా, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేస్, విద్యుత్ అంశాల పేరుతో విచారణలంటూ వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎంతమంది నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.


ప్రస్తుతం రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా నడుపుతోందని, ఆ ముఠాకు నాయకుడు సీఎం రేవంత్ రెడ్డేనని వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సివిల్ సప్లయ్, సమ్మక్క సారలమ్మ టెండర్లు, పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.1,600 కోట్ల బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలో సీఎం, మంత్రుల మధ్యే విభేదాలు వచ్చాయని తెలిపారు.


రోజుకొక కుంభకోణంతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించిన ఆయన, ప్రభుత్వ అవినీతిపై కూడా సిట్ వేయాలని డిమాండ్ చేశారు. హరీశ్‌ రావు ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆయన వెంట తెలంగాణ సమాజం మొత్తం ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Vemula Prashanth Reddy
Revanth Reddy
Telangana
Singareni coal mines
Harish Rao
BRS
Corruption allegations
Coal contract
Telangana Bhavan
Political vendetta

More Telugu News