Sudhakar Cherukuri: చిరంజీవితో పీరియాడిక్ సినిమా.. ‘పెద్ది’ కోసం ‘ది ప్యారడైజ్’ వాయిదా: నిర్మాత సుధాకర్ చెరుకూరి

Sudhakar Cherukuri Plans Chiranjeevi Periodic Movie Post The Paradise
  • ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విజయంతో జోరు మీదున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి
  • రామ్ చరణ్ సినిమా కోసం నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా వేసే ఆలోచన
  • ‘ది ప్యారడైజ్’ తర్వాత చిరంజీవితో 1970ల నాటి పీరియాడిక్ సినిమా
  • దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే సినిమా కోసం అమెరికాలో కీలక షెడ్యూల్
సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి, తన భవిష్యత్ ప్రాజెక్టులపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నామని, మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయబోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించామని, అయితే అదే సమయంలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా రానుండటంతో వాయిదా వేసే ఆలోచ‌న చేస్తున్నట్లు తెలిపారు. “సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లపై భారం పడింది. మళ్లీ అలా జరగకూడదు. మేమంతా స్నేహితులం కాబట్టి మాట్లాడుకుని సరైన సమయం నిర్ణయిస్తాం” అని ఆయన చెప్పారు. వేసవిలో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉండటంతో అప్పుడు విడుదల చేసే అవకాశం ఉందన్నారు.

ఇక, తన ఇతర ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. ‘ది ప్యారడైజ్’ పూర్తయిన వెంటనే చిరంజీవితో సినిమా ఉంటుందని, ఇది 1970ల నేపథ్యంలో సాగే కథ అని స్పష్టం చేశారు. మరోపక్క దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నిర్మిస్తున్న సినిమా అద్భుతంగా వస్తోందని, దీనికోసం అమెరికాలో 35 రోజుల కీలక షెడ్యూల్ ప్లాన్ చేశామని తెలిపారు.

ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విజయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో ఈ సినిమా ఏపీలో దాదాపు బ్రేక్‌ఈవెన్ సాధించిందని, మిగతా ప్రాంతాల్లో వారాంతానికి లాభాల్లోకి వస్తుందని చెప్పారు. కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, సరైన కంటెంట్ ఉంటే పెద్ద సినిమాల మధ్య కూడా విజయం సాధించవచ్చని ఈ చిత్రం నిరూపించిందని ఆయన అన్నారు.
Sudhakar Cherukuri
Chiranjeevi
The Paradise
Nani
Ram Charan Peddi
Bharta Mahashayulaku Vijnapti
Telugu cinema
periodic movie
Dulquer Salmaan
Pooja Hegde

More Telugu News