అమరావతిలో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’... వైద్యరంగంలో సరికొత్త విప్లవం!

  • అమరావతిలో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’ ఏర్పాటు
  • నూతన ఔషధాలు, చికిత్సా విధానాల ఆవిష్కరణకు మార్గం
  • సీఎం చంద్రబాబు ‘అమరావతి క్వాంటం వ్యాలీ’లో భాగంగా కీలక నిర్ణయం
  • భారీగా విదేశీ పెట్టుబడులు, హై-వాల్యూ ఉద్యోగాల కల్పనకు అవకాశం
  • టీసీఎస్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలు, పరిశోధనా కేంద్రాల భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్రంగా మారనుంది. క్వాంటం టెక్నాలజీ, జీవశాస్త్రాలను అనుసంధానిస్తూ వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ పరిధిలో ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో జీవ విజ్ఞాన శాస్త్రంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడమే ఈ ఫౌండ్రీ ప్రధాన లక్ష్యం.

సాధారణ కంప్యూటర్ల ద్వారా పరిశోధనలకు ఏళ్ల సమయం పట్టే అంశాలను, అసాధ్యమైన ఆవిష్కరణలను క్వాంటం కంప్యూటింగ్ శక్తితో సులభతరం చేయడమే ఈ బయో ఫౌండ్రీ ప్రత్యేకత. దీని ద్వారా మొండి వ్యాధులను నయం చేసే సరికొత్త ఔషధాల రూపకల్పన, ఎంజైమ్ ఇంజినీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో పరిశోధనలు జరగనున్నాయి. 

అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో టీసీఎస్, ఐబీఎం, సీఎస్ఐఆర్, ఐఐటీ ఢిల్లీ, సీవీజే సెంటర్, సెంటెల్లా ఏఐ వంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీ, పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు, వేలాదిగా హై-వాల్యూ ఉద్యోగాలు, పరిశోధన ఆధారిత స్టార్టప్‌లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కార్యరూపం దాల్చిన క్వాంటం విజన్

 2025 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ ఆలోచన కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే శరవేగంగా కార్యరూపం దాల్చడం విశేషం. ఇప్పటికే దేశంలోనే తొలిసారిగా క్వాంటం పాలసీని అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇందులో భాగంగా 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లోనే అత్యంత శక్తిమంతమైన ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ (IBM 133-Qubit Quantum System Two) అమరావతిలో ఏర్పాటు కానుంది. అంతేకాకుండా, దేశంలోనే మొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి.

ఈ సాంకేతికతకు అవసరమైన మానవ వనరులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్ష మందికి పైగా యువతకు క్వాంటం టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన క్వాంటం హ్యాకథాన్లలో 137 కాలేజీల నుంచి 20 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మౌలిక సదుపాయాలు, మానవ వనరులతో భవిష్యత్తులో హెల్త్‌కేర్, బయోటెక్, డీప్‌టెక్ స్టార్టప్‌లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది.




More Telugu News