Chandrababu Naidu: స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు బృందం భేటీ

Chandrababu Naidu meets Indian Ambassador Mridul Kumar in Switzerland
  • ఏపీకి స్విస్ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా చర్చ
  • టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో భాగస్వామ్యానికి ఆహ్వానం
  • విద్యా సంస్థల మధ్య సహకారంపైనా కీలక చర్చలు
  • ఇండియా-EFTA ఒప్పందంతో ఏపీకి ప్రయోజనమని లోకేశ్ ధీమా
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్ కు తరలివెళ్లింది. ఈ క్రమంలో వారు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో జ్యూరిచ్‌లో సమావేశమయ్యారు. దీనిపై లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ-స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించడంపై ఈ భేటీలో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు లోకేశ్ తెలిపారు.

టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైల్వే, ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను ఈ సందర్భంగా లోకేశ్ వివరించారు. పారిశ్రామిక రంగంతో పాటు విద్యా రంగంలోనూ సహకారంపై చర్చించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫార్మా, వైద్య పరికరాలు, స్టార్టప్‌ల రంగాల్లో స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఏపీలోని విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. దీని ద్వారా ఏపీకి చెందిన నిపుణులు, విద్యార్థులు, తెలుగు ప్రవాసులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇటీవలే కుదిరిన ఇండియా-EFTA (ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్) ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఏపీకి స్విస్ పెట్టుబడులు రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Switzerland
Mridul Kumar
Nara Lokesh
Investments
India EFTA
AP investments
Swiss companies
AP Education

More Telugu News