Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu receives warm welcome from Telugu community in Zurich
  • ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు
  • జ్యూరిచ్‌లో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు
  • ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నాలుగు రోజుల పర్యటన
  • సీఎంతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జనవరి 19, సోమవారం ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, ఎన్నారై టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఉన్నారు.

అనంతరం జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జ్యూరిచ్‌లో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. యూరోప్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది," అని అన్నారు.

జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' ను ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి రోడ్డు మార్గంలో దావోస్‌కు బయల్దేరి వెళ్లారు.
Chandrababu Naidu
WEF
World Economic Forum
Davos
Andhra Pradesh
Nara Lokesh
T G Bharat
Zurich
Investments
Singapore

More Telugu News