Kavitha: కవిత కొత్త పార్టీ... రంగంలోకి ప్రశాంత్ కిశోర్!

Kavitha New Party Prashant Kishor Enters the Field
  • కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు
  • వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో వరుస సమావేశాలు
  • తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మారుస్తానని ప్రకటన
  • మైనార్టీలు, బీసీలు, యువతకు తన పార్టీలో చేరాలని ఆహ్వానం
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక, తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఆమెకు సహాయం అందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గత రెండు నెలల వ్యవధిలో ప్రశాంత్ కిశోర్ రెండుసార్లు హైదరాబాద్ వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమావేశాలపై కవిత గానీ, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే కొత్త పార్టీ అవసరమని కవిత బలంగా వాదిస్తున్నారు. తన సారథ్యంలోని ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ శక్తిగా మార్చి, 2029 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ విధివిధానాల రూపకల్పనకు దాదాపు 50 కమిటీలతో అధ్యయనం చేయిస్తున్నారు. అదే సమయంలో మైనార్టీలు, బీసీలు, యువత తనతో కలిసి రావాలని, తన ‘తెలంగాణ సెక్యులర్ పార్టీ’కి మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు.

గతంలో ఏపీలో వైఎస్ జగన్‌కు, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు, వ్యూహకర్తగా పనిచేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీకి కూడా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కవితతో జతకట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కవిత క్షేత్రస్థాయి సన్నాహాలు, మరోవైపు పీకే వ్యూహాత్మక మార్గదర్శకత్వంతో త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త రాజకీయ ప్రయోగం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Prashant Kishor
Telangana Politics
Telangana Secular Party
2029 Elections
Telangana Jagruthi
Political Strategy

More Telugu News