Renu Desai: మహేశ్ బాబు సినిమాలో అవకాశం వచ్చింది.. కానీ,.. : రేణు దేశాయ్
- సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రేణు దేశాయ్
- ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటున్న రేణు
- 'సర్కారు వారి పాట'లో తనకు ఛాన్స్ వచ్చిందని వెల్లడి
టాలీవుడ్ ప్రేక్షకులకు రేణు దేశాయ్ అంటే నటిగా మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా మంచి గుర్తింపు ఉంది. 'బద్రి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, పవన్ కల్యాణ్ సరసన 'జానీ' చిత్రంలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో పవన్‌తో ప్రేమ, వివాహం, ఇద్దరు పిల్లల తల్లి కావడం వంటి కీలక మలుపులు ఆమె జీవితంలో చోటుచేసుకున్నాయి. కొన్ని కారణాల వల్ల పవన్ తో విడిపోయిన తర్వాత, పిల్లలతో కలిసి స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగిస్తూ, తనదైన మార్గంలో ముందుకెళుతున్నారు.
ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో... ప్రాధాన్యత కలిగిన పాత్రలపై ఆమె దృష్టి సారించారు. రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు అవకాశం వచ్చిందని, కథతో పాటు పాత్ర కూడా నచ్చిందని తెలిపారు. నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ కారణాలు వెల్లడిస్తే అనవసర వివాదాలు చెలరేగుతాయని భావించి మౌనం పాటిస్తున్నానని రేణు తెలిపారు. దీంతో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.