Bandla Ganesh: చంద్రబాబు కోసం మొక్కుకున్నా.. ఇది రాజకీయ యాత్ర కాదు: బండ్ల గణేశ్

Bandla Ganesh clarifies his yatra is not political but a personal vow for Chandrababu
  • షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ పాదయాత్ర
  • చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని మొక్కుకున్నట్లు వెల్లడి
  • ఈ యాత్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఇది పూర్తిగా వ్యక్తిగత భక్తి, అభిమానంతో చేస్తున్న యాత్ర అని వెల్లడి
సినీ నిర్మాత బండ్ల గణేశ్, తాను చేపట్టిన 'సంకల్ప యాత్ర'పై స్పష్టత ఇచ్చారు. షాద్‌నగర్‌ నుంచి తిరుమల వరకు చేస్తున్న ఈ పాదయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత మొక్కు అని స్ప‌ష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ యాత్ర చేస్తున్నానని, దీనిని రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

పాదయాత్ర ప్రారంభానికి ముందు షాద్‌నగర్‌లో బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపారు. "ఆ రోజు ఉదయం 4.30 గంటలకే చంద్రబాబు అరెస్ట్ వార్త చూసి షాక్‌కు గురయ్యాను. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని అలా అరెస్ట్ చేయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన జైలు నుంచి క్షేమంగా బయటకు వస్తే, తిరుమలకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండల వాడికి మొక్కుకున్నాను" అని బండ్ల గణేశ్ వివరించారు.

దేవుడి దయతో 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఏమైనా చేస్తారేమోనని ప్రతిక్షణం భయపడ్డానని, కోర్టు వాయిదాల సమయంలో ఢిల్లీకి కూడా వెళ్లానని గుర్తుచేసుకున్నారు. 

"ఇది రాజకీయ యాత్ర కాదు. నా అభిమాన నాయకుడి కోసం దేవుడికి మొక్కు చెల్లించుకుంటున్నాను. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు అభిమాని వేసే అడుగు" అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. తన యాత్రను ఒక సాధారణ భక్తి యాత్రగా మాత్రమే చూడాలని, దీనిపై విమర్శలు చేయవద్దని ఆయన కోరారు. అలాగే, ఈ యాత్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 
Bandla Ganesh
Chandrababu Naidu
Tirumala
Padayatra
AP CM
Political Yatra
Shahd Nagar
YCP Government
Andhra Pradesh Politics
Telugu Film Producer

More Telugu News