: ప్రియురాలి దారుణ హత్య.. మృతదేహాన్ని పెట్టెలో పెట్టి కాల్చేసిన వృద్ధుడు!

  • సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా హత్య చేసిన ప్రియుడు
  • మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇనుప పెట్టెలో పెట్టి దహనం
  • డబ్బుల కోసం వేధించడమే హత్యకు కారణమని పోలీసుల వెల్లడి
  • ఆటో డ్రైవర్ సమాచారంతో వెలుగులోకి వచ్చిన కిరాతకం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఓ ఇనుప పెట్టెలో పెట్టి రోజుల తరబడి కాల్చేశాడు. చివరకు ఆ పెట్టెను తరలిస్తుండగా ఆటో డ్రైవర్‌కు వచ్చిన అనుమానంతో ఈ ఘోరం బయటపడింది.

ఝాన్సీకి చెందిన రామ్ సింగ్ పరిహార్ (64) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రీతి (35) అనే మహిళతో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, డబ్బు విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన ప్రీతిని హత్య చేసిన పరిహార్ మృతదేహాన్ని అద్దె ఇంట్లో ఉంచి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు.

మృతదేహాన్ని ముక్కలుగా చేసి, రోజూ కొన్ని భాగాలను ఓ పెద్ద ఇనుప పెట్టెలో పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడు రోజుల పాటు ఇదే పని చేశాడు. శనివారం రాత్రి, మిగిలిన శరీర భాగాలు, కాలిపోయిన ఎముకలు ఉన్న పెట్టెను తన రెండో భార్య ఇంటికి తరలించేందుకు ఓ లోడర్ ఆటోను మాట్లాడుకున్నాడు. అయితే, పెట్టె నుంచి వస్తున్న తీవ్రమైన దుర్వాసన, కారుతున్న ద్రవాలతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు వచ్చేలోపే ప్రధాన నిందితుడు రామ్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు పెట్టెను తెరిచి చూడగా, అందులో కాలిపోయిన స్థితిలో ఉన్న మనిషి ఎముకలు, శరీర భాగాలు కనిపించాయి. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు సహకరించాడన్న అనుమానంతో నిందితుడి కుమారుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న రామ్ సింగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

More Telugu News