Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానన్న పటాన్‌చెరు ఎమ్మెల్యే

MLA Mahipal Reddy Regrets Joining Congress
  • అనుచరులతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 
  • కాంగ్రెస్ లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆవేదన 
  • మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్న మహిపాల్‌‌రెడ్డి
పటాన్‌చెరు శాసనసభ్యుడు మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పిదమని ఆయన పేర్కొన్నారు. పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఆనాటి పరిస్థితుల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానని, దానివల్ల నియోజకవర్గానికి, ప్రజలకు, తనకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన అన్నారు. భారత రాష్ట్ర సమితి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో ఉన్న 104 మంది కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారీగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన సూచించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు, కేవలం అనుచరులతో మాత్రమే ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అయితే, సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
Mahipal Reddy
Patancheru
MLA Mahipal Reddy
Congress Party
BRS
Municipal Elections
Telangana Politics
Patancheru Constituency

More Telugu News