Revanth Reddy: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet Decisions Key Highlights
  • సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించిన వైనం
  • 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న మంత్రి పొంగులేటి
  • మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడి
తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో నిన్న జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

చరిత్రలో తొలిసారిగా మేడారంలో 27వ కేబినెట్‌ భేటీ నిర్వహించామని, మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ఏకాభిప్రాయంతో సమావేశం విజయవంతంగా సాగిందని పొంగులేటి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులు, డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితమే రిజర్వేషన్లు ఖరారయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేసే దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.

అలాగే 2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో, వాటిని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్‌ సర్క్యూట్‌ ఏర్పాటు చేయనున్నట్లు, దీనికి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదికను ఫిబ్రవరి 15లోపు సమర్పించనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ - 2 ఏ, బీ దశలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగిందని, భూసేకరణ కోసం రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లపూర్‌ ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 
Revanth Reddy
Telangana cabinet
Medaram
Municipal elections Telangana
Godavari Pushkaralu
Hyderabad Metro Phase 2
Pottalapur Lift Irrigation Scheme
Telangana news
Komatireddy Venkat Reddy
Seethakka

More Telugu News