Chandrababu Naidu: దావోస్ కు చంద్రబాబు బృందం పయనం... షెడ్యూల్ ఇదిగో!

Chandrababu Naidu Davos Trip Focuses on Investment for Andhra Pradesh
  • పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
  • నాలుగు రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • ఐబీఎం, గూగుల్ క్లౌడ్, టాటా సన్స్ సహా పలు దిగ్గజాలతో భేటీ
  • ప్రపంచ వేదికపై ఏపీని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా 'ఏపీ లాంజ్' ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనకు బయల్దేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఆదివారం రాత్రి విజయవాడ నుంచి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఈ రాత్రి 1.45 గంటలకు దావోస్ కు పయనమవుతారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.

జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో వన్-టు-వన్ సమావేశాలు, 9 రౌండ్‌టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించి, పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్‌మండ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. అలాగే యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రితోనూ భేటీ కానున్నారు.

ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు దావోస్‌లో వరుసగా రెండో ఏడాది కూడా 'ఏపీ లాంజ్' పేరుతో ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. దావోస్‌కు వెళ్లే ముందు జ్యూరిచ్‌లో 20 దేశాల నుంచి వచ్చే ప్రవాస తెలుగువారితో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) భరిస్తోంది. జనవరి 23న సీఎం బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Davos
WEF 2026
investment
Nara Lokesh
TG Bharat
APEDB

More Telugu News