Virat Kohli: కోహ్లీ వీరోచిత సెంచరీ... అయినా ఓడిపోయిన టీమిండియా... కివీస్ దే సిరీస్

Virat Kohli Century in Vain India Loses to New Zealand
  • మూడో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం
  • 1-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్
  • విరాట్ కోహ్లీ అద్భుత శతకం వృథా
  • డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగిన కివీస్
  • రాణించిన యువ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, హర్షిత్ రానా
భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియాపై 41 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు కివీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాప్ ఆర్డర్ విఫలమైనా, విరాట్ కోహ్లీ (124) ఒంటరి పోరాటం చేశాడు. కాగా, కోహ్లీకి వన్డేల్లో ఇది 54వ సెంచరీ. అతనికి యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రానా (52) అర్ధశతకాలతో అండగా నిలిచారు. అయినప్పటికీ, కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్, జాకరీ ఫౌల్క్స్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Virat Kohli
India vs New Zealand
NZ tour of India
Daryl Mitchell
Glenn Phillips
Cricket series
ODI series
Cricket
Indian cricket team
New Zealand cricket team

More Telugu News