Chandrababu Naidu: ఐఐటీ మద్రాస్, ఐబీఎం క్వాంటం కోర్సులకు పోటెత్తిన ఏపీ యువత... సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Hails AP Youth Response to IIT Madras IBM Quantum Course
  • క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఏపీ నుంచి విశేష స్పందన
  • ఇప్పటికే 50 వేలకు పైగా అడ్మిషన్లు నమోదు
  • లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
  • ఏపీని క్వాంటం రీసెర్చ్ హబ్‌గా మారుస్తామని వెల్లడి
  • కోర్సు విజేతలను వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటన
ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్‌పీటీఈఎల్ (NPTEL) కింద అందిస్తున్న ‘అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్’ కోర్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశేష స్పందన రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సులో ఇప్పటికే రాష్ట్రం నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు చేరడం సంతోషకరమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ, క్వాంటం టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్న తమ లక్ష్యానికి ఈ స్పందన మరింత బలాన్నిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తు క్వాంటం టెక్నాలజీదేనని పేర్కొన్న చంద్రబాబు, ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిని తానే వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటించారు. క్వాంటం రంగంలో భవిష్యత్ ప్రపంచ నాయకులుగా ఎదిగే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Chandrababu Naidu
IIT Madras
IBM
Quantum Computing
Andhra Pradesh
NPTEL
Quantum Technology
AP Government
Skills Development

More Telugu News