అమ్ముడుపోయిన 'కోటరీల' మధ్య 'బందీలుగా' ఉన్న నాయకులారా ఆలోచించుకోండి: విజయసాయిరెడ్డి

  • ప్రజా నాయకులకు విజయసాయిరెడ్డి సంచలన హెచ్చరిక
  • వెనెజువెలా అధ్యక్షుడి ఉదంతాన్ని గుర్తు చేసిన వైనం
  • అమ్ముడుపోయిన కోటరీల వల్ల ప్రమాదమని వ్యాఖ్య
  • కోటరీల మధ్య నేతలు బందీలుగా ఉన్నారంటూ ఘాటు విమర్శ
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రజా నాయకులు తమ చుట్టూ ఉన్న కోటరీల మధ్య బందీలుగా ఉన్నారని, భవిష్యత్తులో వారికి ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

వెనెజువెలాలో భారీ ప్రజాదరణ ఉన్న అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికా సులువుగా ఎత్తుకుపోయిందని గుర్తు చేశారు. అధ్యక్షుడి చుట్టూ ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు అమ్ముడుపోవడమే దీనికి కారణమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. భారీ సైన్యం, యుద్ధ విమానాలు ఉన్నా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఇది జరిగిందంటే దానికి కారణం "వారంతా అమ్ముడు పోవటమే కదా" అని ట్వీట్ చేశారు.

ఈ ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతూ, "అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!" అని ఆయన తన పోస్టులో ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

విజయసాయిరెడ్డి గతంలో పార్టీకి రాజీనామా చేసే సమయంలో, జగన్ పై విమర్శలు చేయడం తెలిసిందే. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో, వెనెజువెలా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, విజయసాయిరెడ్డి "కోటరీ" అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News