Gottipati Ravikumar: వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ప్రవహిస్తే, ఇప్పుడు పొలాలకు నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravikumar Says Palanadu Now Has Water Not Blood
  • వైసీపీ నేతలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి ఫైర్
  • వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ ఆగ్రహం
  • పల్నాడు ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • కుట్రల వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పంట భూములకు సాగునీరు పారుతోందని పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడులో ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన ఆదివారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి, టీడీపీపై బురద చల్లేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఫ్యాక్షన్, అక్రమ మైనింగ్, దౌర్జన్యాలతో పల్నాడు ప్రాంతం వల్లకాడుగా మారిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన 300 మంది భయంతో ఊరు విడిచి పారిపోయారని గుర్తుచేశారు. ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే జగన్ ఐదేళ్ల పాలనలో 12 మందిని హత్య చేశారని, వారిలో ఎస్సీ, బీసీలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అక్రమ మైనింగ్ కోసం తవ్విన గుంతల్లో పడి ఏడెనిమిది మంది చనిపోయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బాధితులను పరామర్శించడానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పల్నాడుకు వస్తే, ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గతంలో ఊరు విడిచి వెళ్లిన వారంతా ధైర్యంగా తిరిగి గ్రామాలకు వస్తున్నారని గొట్టిపాటి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక పల్నాడు రైతులకు సాగునీటి కష్టాలు తీర్చామని, పొలాలకు నీటిని అందిస్తున్నామని వివరించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నదే చంద్రబాబు ఆశయమని అన్నారు. 

వైసీపీ కుట్రపూరిత, విధ్వంసకర రాజకీయాల వల్లే ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా వారికి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదనతో పుట్టిన పార్టీ వైసీపీ అని, తెలుగోడి ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని మంత్రి గొట్టిపాటి వ్యాఖ్యానించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించిందని ఆరోపించారు. గ్రామాల్లో జరిగే హత్యలకు రాజకీయ రంగు పులిమి, ఎవరు చనిపోతారా అని ఎదురుచూస్తూ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొందని, దీనికి ఎవరు భంగం కలిగించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ లేని పల్నాడును నిర్మించి, ప్రతి రైతు కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి పునరుద్ఘాటించారు.
Gottipati Ravikumar
Palanadu
YSRCP
TDP
Chandrababu Naidu
Faction politics
Illegal mining
Andhra Pradesh politics
Irrigation
Guntur district

More Telugu News