Donald Trump: ట్రంప్ మమ్మల్ని ఫూల్స్ ని చేశాడు: ఇరాన్ నిరసనకారుల తీవ్ర ఆగ్రహం

Donald Trump Fooled Us Say Iran Protesters
  • ఇరాన్ లో నిరసనకారులకు ట్రంప్ మద్దతు
  • దాంతో మరింత రెచ్చిపోయి ఆందోళనలు చేసిన నిరసనకారులు
  • ప్రభుత్వ అణచివేతలో 15,000 మంది మరణించారని ఆరోపణలు
  • ట్రంప్ మాట మార్చి వెనక్కి తగ్గడంతో ప్రజల ఆగ్రహం
  • తమను బలిపశువులను చేశారంటూ ట్రంప్‌పై ఇరానియన్ల విమర్శలు
  • ఆర్థిక సమస్యలతో మొదలై రాజకీయ రూపుదాల్చిన ఆందోళనలు
ఇరాన్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను నమ్మించి మోసం చేశాడని, ద్రోహానికి పాల్పడ్డాడని అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన హామీలను నమ్మి తాము రోడ్లపైకి వస్తే, ఆయన తమను ఫూల్స్ ని చేశాడని, మాట మార్చి తమను నట్టేట ముంచాడని ఆవేదన చెందుతున్నారు.

ఇరాన్‌లో ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు ప్రభుత్వ మార్పు డిమాండ్‌తో ఉద్ధృతంగా మారినప్పుడు, ట్రంప్ సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. "త్వరలోనే సహాయం అందుతుంది" అని, శాంతియుత నిరసనకారులపై హింసకు పాల్పడితే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దీంతో అమెరికా సైనిక చర్య తీసుకుంటుందనే ఆశతో చాలామంది నిరసనల్లో పాల్గొన్నారు.

అయితే, ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసింది. స్నైపర్ ఫైరింగ్, మెషీన్ గన్లతో జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని (దాదాపు 15,000 మంది మరణించారని అంచనా) నివేదికలు వచ్చాయి. అయితే, ట్రంప్ తన వైఖరిని మార్చుకుని, ఇరాన్ ప్రభుత్వం హత్యలు ఆపేస్తామని హామీ ఇచ్చిందని, సైనిక చర్య ఉండదని ప్రకటించారు. ఈ పరిణామంతో నిరసనకారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ట్రంప్ చర్యలపై TIME పత్రికతో పలువురు ఇరానియన్లు తమ ఆవేదనను పంచుకున్నారు. "ఈ 15,000 మరణాలకు ట్రంపే బాధ్యుడు. ఆయన పోస్టులు చూసే చాలామంది రోడ్లపైకి వచ్చారు" అని టెహ్రాన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అన్నారు. "ట్రంప్ మమ్మల్ని యుద్ధంలో బలిపశువులుగా వాడుకున్నారు. మా కాళ్ల కింద నుంచి నేల లాగేశారు" అని మరికొందరు ఆరోపించారు.

వాస్తవానికి, దేశంలో కరెన్సీ విలువ పడిపోవడం, ధరల పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అయితే, ఇవి క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. ఇరాన్ అధికారులు మాత్రం ఈ నిరసనలను అమెరికా కుట్రగా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ తీరుతో ఇరాన్ ప్రజల్లో ఆయనపై తీవ్ర అపనమ్మకం నెలకొంది.


Donald Trump
Iran protests
Iran
Trump Iran
Iran government
US foreign policy
Tehran
Iranian people
economic crisis

More Telugu News