Bhatti Vikramarka: మీడియా కథనాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Orders Cancellation of Naini Coal Block Tender
  • నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భట్టి
  • కొత్తగా టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశం
  • తనపై వచ్చిన ఆరోపణలు కట్టుకథలని తీవ్రంగా ఖండన
  • దివంగత నేత వైఎస్‌తో ఉన్న స్నేహం వల్లే కొందరు టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్య
  • టెండర్ నిబంధనలు సింగరేణి నిర్ణయిస్తుందని, మంత్రి కాదని స్పష్టీకరణ
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్‌ను రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.

ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియలో తన పాత్ర ఉందంటూ ఒక తెలుగు టీవీ ఛానెల్, పత్రికలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కట్టుకథలు ప్రచురించారని ఆరోపించారు. ఇంకా ఎవరూ పాల్గొనని టెండర్ విషయంలో తమను ఎలా నిందిస్తారని కంపెనీ యాజమాన్యం తన దృష్టికి తెచ్చిందని వివరించారు. టెండర్ నిబంధనలను రూపొందించేది సింగరేణి యాజమాన్యమే తప్ప మంత్రి కాదన్న కనీస అవగాహన కూడా లేకుండా కథనాలు రాశారని విమర్శించారు. 

కాగా, ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దాదాపు దశాబ్దం క్రితం సింగరేణికి కేటాయించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి చరిత్రలో తెలంగాణ వెలుపల ఉత్పత్తి ప్రారంభించిన తొలి గని ఇదే కావడం గమనార్హం.
Bhatti Vikramarka
Naini Coal Block
Singareni Collieries
SCCL
Telangana Deputy CM
Coal Mining Tender
Odisha Coal Mine
Telangana News
Mining News
Tender Cancellation

More Telugu News