Donald Trump: 'గాజా శాంతి బోర్డు'లో సభ్యత్వంపై వివాదం.. రూ.9 వేల కోట్ల ఫీజుపై వైట్ హౌస్ క్లారిటీ

Donald Trump Gaza Peace Board Membership Fee Clarification by White House
  • గాజా శాంతి బోర్డులో సభ్యత్వానికి 1 బిలియన్ డాలర్లు అవసరమంటూ వార్తలు
  • ఈ ఆరోపణలను తప్పుదోవ పట్టించేవిగా పేర్కొన్న వైట్ హౌస్
  • ఇది శాశ్వత సభ్యత్వం కోసమే కానీ, కనీస రుసుము కాదని స్పష్టీకరణ
  • ట్రంప్ ఛైర్మన్‌గా, అమెరికన్ల ఆధిపత్యంతో బోర్డు ఏర్పాటు
  • గాజాలో శాంతిభద్రతల కోసం ప్రత్యేక అంతర్జాతీయ దళం నియామకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన 'గాజా బోర్డ్ ఆఫ్ పీస్'‌లో సభ్యత్వం పొందాలంటే దేశాలు 1 బిలియన్ డాలర్లు  (భారత కరెన్సీలో రూ. 9,087 కోట్లు)  చెల్లించాల్సి ఉంటుందంటూ వచ్చిన వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ నివేదికలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, బోర్డులో చేరడానికి ఎలాంటి కనీస సభ్యత్వ రుసుము లేదని స్పష్టం చేసింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ బోర్డుకు సంబంధించిన ముసాయిదా చార్టర్‌లో ఈ విషయం ప్రస్తావించారు. బోర్డుకు తొలి ఛైర్మన్‌గా ట్రంప్ వ్యవహరిస్తారని, సభ్యులను ఆహ్వానింకే అంశంపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని అందులో ఉంది. చార్టర్ అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోగా 1 బిలియన్ డాలర్లకు పైగా నగదు నిధులను అందించే దేశాలకు మూడేళ్ల సభ్యత్వ కాలపరిమితి వర్తించదని, వారికి శాశ్వత సభ్యత్వం లభిస్తుందని ఆ ముసాయిదాలో పేర్కొన్నట్టు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

ఈ కథనంపై స్పందించిన వైట్ హౌస్.. "ఇది తప్పుదోవ పట్టించేది. శాంతి బోర్డులో చేరడానికి కనీస సభ్యత్వ రుసుము లేదు" అని పేర్కొంది. "శాంతి, భద్రత, శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శించే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వం అందించేందుకే ఈ నిబంధన" అని వివరణ ఇచ్చింది.

కాగా, శుక్రవారం నాడు ట్రంప్ ఈ బోర్డు సభ్యుల వివరాలను ప్రకటించారు. ఇందులో తన అల్లుడు జారెడ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ వంటి అత్యంత సన్నిహితులకు చోటు కల్పించారు. గాజాలో భద్రతను పర్యవేక్షించి, హమాస్ స్థానంలో కొత్త పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసేందుకు 'అంతర్జాతీయ స్థిరీకరణ దళం' (International Stabilisation Force) ఏర్పాటు చేసి, దానికి యూఎస్ మేజర్ జనరల్ జాస్పర్ జెఫర్స్‌ను అధిపతిగా నియమించారు. దీంతో పాటు ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు.
Donald Trump
Gaza
Gaza Board of Peace
White House
Jared Kushner
Marco Rubio
Steve Witkoff
International Stabilisation Force
US Major General Jasper Jeffers
Hamas

More Telugu News