Greenland: ట్రంప్ తీరుకు నిరసనగా గడ్డకట్టించే చలిలో గ్రీన్ లాండ్ వాసుల నిరసన

Greenlanders Massive Protest Against Trumps Acquisition Plans
  • గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదంటూ నినాదాలు
  • ప్రధాని సహా వేలాదిమంది ప్రజల ర్యాలీ
  • ఈయూ దేశాలపై టారిఫ్ విధించడంపై మండిపాటు
గ్రీన్ లాండ్ ను ఏదేమైనా సరే స్వాధీనం చేసుకుని తీరతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్.. అన్నట్టుగానే ఈయూలోని 8 దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాలపై గ్రీన్ లాండ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం గ్రీన్ లాండ్ రాజధాని నగరం నూక్ లో వేలాదిమంది జనం ఆందోళన చేశారు. గడ్డకట్టించే చలిలో జాతీయ పతాకాలను చేతబట్టి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో ‘గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ నినాదాలతో జనం హోరెత్తించారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్ లాండ్ వాసులు స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా గళమెత్తిన ఈయూ దేశాలపై టారిఫ్ లు విధించడాన్ని తప్పుబట్టారు. నూక్ జనాభాలో దాదాపు నాలుగో వంతు జనం ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

నిరసనకారులు తమ పిల్లలను కూడా ఈ ఆందోళనకు వెంట తీసుకువచ్చారు. తమ దేశాన్ని కాపాడుకోవడం, ప్రపంచానికి తమ గొంతు వినిపించడం రేపటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా నిరసనలకు తీసుకొచ్చామని వారు తెలిపారు. కాగా, గ్రీన్ లాండ్ లో ఇప్పటి వరకు జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని స్థానిక పోలీసులు వెల్లడించారు.
Greenland
Greenland protest
Nook Greenland
Donald Trump
Jens Frederik Nielsen
EU Tariffs
Greenland acquisition
Greenland independence
US Tariffs
Greenland Politics

More Telugu News