Bagurumba Dance: 10,000 మందితో కన్నులపండువగా 'బగురుంబా' నృత్యం.. వీడియో షేర్ చేసిన‌ ప్రధాని మోదీ

PM Modi To Witness 10000 Bodo Dancers Perform Bagurumba During Assam Visit
  • అస్సాంలో రెండ్రోజుల పర్యటనకు ప్రధాని మోదీ
  • గువాహ‌టిలో 10,000 మంది కళాకారులతో బగురుంబా నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ప్రధాని
  • ప్రపంచ వేదికపై బోడో సంప్రదాయ నృత్యాన్ని నిలపడమే లక్ష్యమన్న సీఎం హిమంత
  • ఒకప్పటి హింస నుంచి శాంతి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఈ కార్యక్రమం
త్వ‌ర‌లో ఎన్నికలు జరగనున్న అస్సాంలో ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనను శనివారం ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా రాజ‌ధాని గువాహ‌టిలో నిర్వహించిన‌ భారీ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10,000 మంది కళాకారులు బోడో సంప్రదాయ నృత్యమైన 'బగురుంబా'ను ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. నిన్న‌ సాయంత్రం 6 గంటలకు ఈ అద్భుత ప్రదర్శన జరిగింది.

ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా నిలించిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. "బిహు, ఝుమూయిర్ తర్వాత ఇప్పుడు బగురుంబ ప్రపంచ వేదికపై మెరిసే సమయం వచ్చింది" అని ఆయన 'X'లో పోస్ట్ చేశారు. సీతాకోకచిలుక కదలికలను అనుకరిస్తూ చేసే ఈ నృత్యం, ప్రకృతి పట్ల బోడో సమాజానికి ఉన్న ప్రేమకు, గౌరవానికి ప్రతీక. 

సాధారణంగా బోడో మహిళలు మాత్రమే ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురుషులు ఖామ్ (మేక చర్మంతో చేసిన డ్రమ్), సిఫుంగ్ (వెదురు ఫ్లూట్) వంటి సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తారు. ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి కళాకారులు చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్ర‌ధాని మోదీ త‌న 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "గువాహ‌టిలో అద్భుతమైన బగురుంబా ద్వౌ కార్యక్రమం!" అనే క్యాప్ష‌న్‌తో ఈ వీడియోను ప్ర‌ధాని పంచుకున్నారు. 

ఈ సాంస్కృతిక వైభవం వెనుక ఒకప్పటి హింసాత్మక గతం నుంచి శాంతియుత భవిష్యత్తు వైపు సాగిన సుదీర్ఘ ప్రస్థానం ఉంది. 1980-90 దశకాల్లో బోడో మిలిటెంట్ ఉద్యమాలు ఆ ప్రాంతంలో తీవ్రమైన హింసకు, వలసలకు కారణమయ్యాయి. అయితే, 2003లో జరిగిన బోడో ఒప్పందం, ఆ తర్వాత 2020లో ఎన్డీఎఫ్‌బీ, 2021లో ఎన్ఎల్ఎఫ్‌బీ మిలిటెంట్లు లొంగిపోవడంతో బోడోలాండ్‌లో శాంతి శకం మొదలైంది. వేలాది మంది మిలిటెంట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.

ప్రస్తుతం కోక్రాఝార్, చిరాంగ్, బక్సా, ఉదల్‌గురి జిల్లాలతో కూడిన బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR) అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ భారీ సాంస్కృతిక కార్యక్రమం బోడో సమాజం సాధించిన శాంతి, పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది.
Bagurumba Dance
PM Modi
Narendra Modi
Assam
Guwahati
Bodo community
cultural event
Himanta Biswa Sarma
Bodo agreement
Bodo militants
cultural program

More Telugu News