Chandrababu Naidu: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. ఈ ఏడాదిలోనే పూర్తికి డెడ్‌లైన్

Chandrababu Naidu focuses on irrigation projects completion this year
  • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ఆదేశం
  • ఈ ఏడాదిలోనే వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి లక్ష్యం
  • పూర్వోదయ స్కీం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
  • దావోస్ పర్యటన నుంచి తిరిగొచ్చేలోగా నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది (2026) లోపే వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

గతంలో హంద్రీ-నీవా కాలువ వెడల్పు, పోలవరం పనులను వేగవంతం చేసిన తరహాలోనే ఈ ఏడాది వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే తాను వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పూర్వోదయ పథకం, పీపీపీ పద్ధతిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ వంటి అంశాలపై చర్చించారు.

పూర్వోదయ పథకం ద్వారా ప్రకాశం, రాయలసీమల్లోని 9 జిల్లాలను అభివృద్ధి చేయవచ్చని, ముఖ్యంగా ఉద్యాన రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని సీఎం అన్నారు. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండేలా చూడాలని సూచించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో చర్చలు జరపాలని తెలిపారు. వృథాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవాలన్నదే ఉద్దేశమని, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.

పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు గుర్తించిన 290 ప్రాజెక్టులపై సమగ్ర జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. తాను దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చేసరికి అన్ని ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Irrigation projects
Andhra Pradesh
Veligonda project
Uttarandhra projects
Polavaram project
Handri Neeva canal
Jal Jeevan Mission
PPP projects
Nallamala Sagar project

More Telugu News