Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి రాత్రి మహాపూజలతో ప్రారంభం

Keslapur Nagoba Jatara all set to begin tonight with special prayers
  • కేస్లాపూర్‌లో నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం
  • పుష్య అమావాస్య సందర్భంగా రాత్రి మహాపూజలు
  • పవిత్ర గోదావరి జలాలతో నాగోబాకు మెస్రం వంశీయుల అభిషేకం
  • 22న గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దర్బార్ నిర్వహణ
  • ఐదు రాష్ట్రాల నుంచి తరలిరానున్న ఆదివాసీలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో జరిగే ప్రఖ్యాత నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ ఆదివాసీల మహా వేడుక, పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ‌ రాత్రి 10 గంటలకు మహాపూజలతో అధికారికంగా ప్రారంభం కానుంది.

మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్‌ పూజ, మహిళలు విశేషంగా పాల్గొనే భాన్‌ దేవత పూజలు జరుగుతాయి. ఈనెల 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో 'దర్బార్‌' నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తారు.

అనంతరం 23న భేతల్‌ పూజలు, మండ గాజిలింగ్‌ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ, భక్తుల రద్దీ మాత్రం ఈనెల 25 వరకు కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Keslapur Nagoba Jatara
Keslapur
Adivasi festival
Mesram Tribe
Godavari river
Telangana festivals
Adilabad
Tribal fair
Hasthinamadugu

More Telugu News