ధోనీ మ్యాజిక్ రిపీట్.. అండ‌ర్‌-19 ప్రపంచకప్‌లో వైరల్ అయిన రనౌట్.. ఇదిగో వీడియో!

  • అండ‌ర్‌-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ 28 పరుగుల తేడాతో గెలుపు
  • అర్ధశతకాలతో రాణించిన‌ ఫైసల్ షినోజాదా, ఖలీద్ అహ్మద్‌జాయ్ 
  • ధోనీ తరహా రనౌట్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్
  • 2016 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ చేసిన స్టంపింగ్‌ను గుర్తుచేసిన ఘటన
విండ్‌హెక్‌ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తుచేసేలా చేసిన ఓ అద్భుతమైన రనౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ఫైసల్ షినోజాదా (81), ఖలీద్ అహ్మద్‌జాయ్ (74) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, 238 పరుగులకే ప‌రిమిత‌మైంది.

దక్షిణాఫ్రికా ఛేజింగ్‌లో 14వ ఓవర్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బౌలర్ వాహీదుల్లా జద్రాన్ వేసిన బంతిని దక్షిణాఫ్రికా కెప్టెన్ మహమ్మద్ బుల్బులియా ఆడటంలో విఫలమయ్యాడు. బౌలర్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా, అంపైర్ తిరస్కరించాడు. ఇదే సమయంలో వికెట్ల వెనుక బంతిని అందుకున్న కీపర్ మహబూబ్ ఖాన్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెయిల్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో బుల్బులియా పాదం గాల్లోనే ఉన్నట్లు తేలడంతో అతను 17 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఈ రనౌట్ 2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన ఐకానిక్ స్టంపింగ్‌ను గుర్తుకు తెచ్చింది. ఆ మ్యాచ్‌లో సబ్బీర్ రెహ్మాన్‌ను ధోనీ ఇదే తరహాలో క్షణాల్లో స్టంప్ అవుట్ చేశాడు. ఇక టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆదివారం వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా సోమవారం టాంజానియాతో తలపడనున్నాయి.


More Telugu News