Nandamuri Balakrishna: బాలయ్య అఖండ-2పై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర విశ్లేషణ

Nandamuri Balakrishna Akhanda 2 Interesting Analysis by Paruchuri Gopalakrishna
  • అఖండ - 2 సినిమా విజయంలో బాలకృష్ణకే క్రెడిట్‌ దక్కుతుందన్న పరుచూరి గోపాలకృష్ణ
  • సినిమాలో హీరోకు సంబంధించిన రెండో పాత్రను యంగ్‌ లుక్‌లో చూపించకపోవడం దర్శకుడి సాహసమేనని వ్యాఖ్య
  • దేశానికి ప్రమాదం ఏర్పడితే దాన్ని కాపాడేది శివుడేనన్న భావనతో ఈ కథను చెప్పే ప్రయత్నం జరిగిందన్న పరుచూరి  
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2 చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఈ సినిమా విజయానికి బాలకృష్ణే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పరుచూరి, అఖండ 2 సినిమాపై తన విశ్లేషణను పంచుకున్నారు.

దర్శకుడు బాలయ్యను అఖండ గెటప్‌లో ఇంటర్వెల్‌కు ముందు చూపించాలని నిర్ణయించడంతోనే తొలి భాగాన్ని గుర్తుకు తెచ్చేలా కథను ముందుకు నడిపారని ఆయన తెలిపారు. హీరోకు సంబంధించిన రెండో పాత్రను యంగ్‌ లుక్‌లో చూపించకపోవడం దర్శకుడి సాహసమని పేర్కొన్నారు. ఈ సినిమాలో డ్యూయెట్లు లేకపోవడం విశేషమని, ఇది భక్తి పారవశ్యంతో నిండిన చిత్రమని అన్నారు. కుంభమేళాను కథలో ఒక కీలక అంశంగా మలిచారని చెప్పారు. కొన్ని సన్నివేశాలపై టిబెట్ సరిహద్దుల ప్రస్తావన వస్తున్నా, సినిమాలో ఆ పేరు తాను ఎక్కడా వినలేదని స్పష్టం చేశారు. దేశానికి ప్రమాదం ఏర్పడితే దాన్ని కాపాడేది శివుడేనన్న భావనతో ఈ కథను చెప్పే ప్రయత్నం జరిగిందని విశ్లేషించారు.

కొన్ని వాస్తవ సంఘటనలకు దైవత్వాన్ని జోడిస్తూ బోయపాటి శ్రీను అద్భుతమైన స్క్రీన్‌ప్లే రూపొందించారని పరుచూరి ప్రశంసించారు. భారతీయ సంస్కృతిని ఎవరూ నాశనం చేయలేరన్న సందేశాన్ని ఈ సినిమా బలంగా చెబుతుందని అన్నారు. క్షుద్ర నీతి, రుద్ర నీతి మధ్య జరిగే పోరాటంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని వ్యాఖ్యానించారు. అఖండ పాత్రలో బాలకృష్ణను చూస్తే తనకు ఒళ్లు పులకరించిందని, ఆయనను చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారని భావోద్వేగం వ్యక్తం చేశారు.

‘కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం.. ప్రతి గడపా నా గడపే’ వంటి డైలాగ్స్‌ చాలా గమ్మత్తుగా అనిపించాయని చెప్పారు. యాక్షన్, డైలాగ్స్ విషయంలో బాలకృష్ణకు హ్యాట్సాఫ్ అని కొనియాడుతూ, అందుకే ఈ సినిమాకు ఆయనకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై సందడి చేసిన అఖండ 2 ప్రస్తుతం ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
Nandamuri Balakrishna
Akhanda 2
Paruchuri Gopalakrishna
Boyapati Srinu
Telugu cinema
OTT streaming
Netflix
Movie review
Akhanda movie
Indian culture

More Telugu News