Sai Sharath: రికార్డులకే రికార్డు... కొత్తల్లుడికి 1,574 వంటకాలతో విందు

Sai Sharath Honored with 1574 Dishes Feast in Konaseema
  • కోనసీమలో కొత్త అల్లుడికి అపూర్వ ఆతిథ్యం
  • సంక్రాంతి కానుకగా 1574 రకాల వంటకాలతో విందు
  • తొలిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడు సాయి శరత్‌కు ప్రత్యేక మర్యాద
  • మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన గోదావరి జిల్లాల ఆతిథ్యం
సంక్రాంతి పండుగ వేళ కోనసీమలో ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి అపూర్వ రీతిలో ఆతిథ్యమిచ్చింది. ఏకంగా 1,574 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల మర్యాదను మరోసారి చాటిచెప్పింది. ఈ ఘటన కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదుర్రు గ్రామానికి చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కుమార్తె కీర్తిశ్రీని గత ఏడాది ఫిబ్రవరిలో పి. గన్నవరం మండలం ముంగండకు చెందిన సాయి శరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ సంక్రాంతి వారిద్దరికీ తొలి పండుగ కావడంతో, అల్లుడు సాయి శరత్ గురువారం అత్తవారింటికి వచ్చాడు.

ఈ సందర్భంగా అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా విందు ఇవ్వాలని భావించిన అత్తమామలు ఈ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ విందులో సంప్రదాయ పిండివంటలు, స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు సహా మొత్తం 1,574 రకాల పదార్థాలను వడ్డించారు. అంతేకాకుండా, ఏడాదిలోని 12 నెలలకు ప్రతీకగా అల్లుడికి 12 ప్రత్యేక బహుమతులు కూడా అందించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ అసాధారణ ఆతిథ్యం చూసి అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

ఇటీవలే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఓ కొత్తల్లుడికి 1,116 వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడా రికార్డు బద్దలైంది. విశాఖలో ఓ కొత్త అల్లుడికి 290 వంటకాలతో విందు ఏర్పాటు చేయడం తెలిసిందే. తెనాలిలో మరో కొత్తల్లుడికి 158 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. 
Sai Sharath
Konaseema
Andhra Pradesh
Sankranti festival
1574 dishes
new son in law
lavish feast
Indian cuisine
Telugu traditions
Adurru village

More Telugu News