Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- అత్యాచార ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారనే కేసు
- గతంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు
- కోర్టు విచారణలకు హాజరుకాని గోరంట్ల మాధవ్
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు న్యాయపరంగా తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విజయవాడలోని పోక్సో ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిరంగంగా వెల్లడించారనే ఆరోపణలతో గోరంట్ల మాధవ్‌పై గతంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చారు.
ఈ కేసు విచారణకు రావాలంటూ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో, చివరకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అయితే, తనపై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు తదుపరి విచారణలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.