Asaduddin Owaisi: మహారాష్ట్రలో మా విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం: ఒవైసీ
- మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది ఎంఐఎం కార్పొరేటర్ల విజయం
- ఎంఐఎం విజయంపై ఒవైసీ హర్షం
- ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి కీలక నగరాల్లో పార్టీ తన ఉనికిని బలంగా చాటుతూ, మొత్తం 125 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది.
ఈ విజయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
మహారాష్ట్రలో తమ పార్టీకి వచ్చిన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. ఓటమి ఎదుర్కొన్న పార్టీలు తమను నిందించకుండా తమ వైఫల్యాలపై ఆలోచించాలని హితవు పలికారు. పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు పార్టీతోనే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేసిన ఓవైసీ, తమ కార్పొరేటర్లను ఏకతాటిపై ఉంచేందుకు అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంఐఎం సిద్ధమవుతోందని, ఆసక్తి ఉన్న అభ్యర్థుల పేర్లను పార్టీ ఇప్పటికే కోరిందని తెలిపారు.