Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Chandrababu Naidu Launches AM Green Project in Kakinada with Pawan Kalyan
  • కాకినాడలో రూ.18 వేల కోట్ల ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అవుతుందన్న సీఎం చంద్రబాబు
  • ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమగా రూపకల్పన
  • 2027 జూన్ నాటికి ప్రాజెక్టు తొలి దశ ఉత్పత్తి ప్రారంభం
  • రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ను 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ'గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పర్యావరణహిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాకినాడలో సుమారు రూ.18 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 'ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా' ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక 'గేమ్ ఛేంజర్'గా నిలవనుందని, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమగా ఇది చరిత్ర సృష్టించనుందని అన్నారు.

భవిష్యత్తు మొత్తం గ్రీన్ ఎనర్జీదేనని, ఈ క్రమంలో గ్రీన్ అమ్మోనియా కీలక పాత్ర పోషించనుందని చంద్రబాబు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. "2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాతో మరో ముందడుగు వేస్తున్నాం. 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుంది" అని ఆయన ప్రకటించారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని, కాలుష్యం కారణంగా సముద్ర జీవావరణంలో పెను మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సహజ వనరులు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి తెలిపారు. వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం, రానున్న 20 పోర్టులు, రాష్ట్రంలో పుష్కలంగా లభించే సౌర, పవన విద్యుత్ వనరులు మనకు వరమని పేర్కొన్నారు. సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూనే, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరిని మర్చిపోకూడదని హితవు పలికారు. గొప్ప ఆలోచనలను ఆచరణలో పెట్టేవారు అరుదుగా ఉంటారని, అలాంటి వారిలో పారిశ్రామికవేత్త చలమలశెట్టి అనిల్ ఒకరని ప్రశంసించారు.

గతంలో ఎన్టీఆర్ చొరవతోనే కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుతో కాకినాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయాన్నైనా తక్షణమే అమలు చేస్తుందని స్పష్టం చేశారు. 

"2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చూడాలన్నదే నా ఆకాంక్ష. గ్రీన్ అమ్మోనియా వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రకృతి సేద్యం పెరగడమే మనందరి ఆరోగ్యానికి శ్రీరామరక్ష" అని అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. 

ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను ఏ దేశానికైనా ఎగుమతి చేసే వీలుంటుందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప బలాన్ని ఇస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, కాకినాడ ప్రాంతం ఒక కీలక పారిశ్రామిక, హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Pawan Kalyan
AM Green Ammonia Project
Kakinada
Green Hydrogen Valley
Green Energy
AP Government
Renewable Energy
AP Economy

More Telugu News