గణతంత్ర దినోత్సవం.. ఉగ్రవాద ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరిక

  • దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ఖలిస్థాని, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలు
  • హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలలో హైఅలర్ట్
  • ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాలు, ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు సమాచారం ఉందని, అక్కడ హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు.

దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థలు స్థానిక గ్యాంగ్‌స్టర్లను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నాయి. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాలు, ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు విదేశాల నుంచి పనిచేస్తున్న ఖలిస్తానీ, రాడికల్ హ్యాండ్లర్లకు సహకరిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. "ఉగ్రవాద సంస్థలు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు క్రిమినల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటున్నాయి" అని పేర్కొన్నాయి.


More Telugu News