: పూణె ఎన్నికల్లో జైలు నుంచే గెలిచిన అత్తాకోడళ్లు

  • యువకుడి హత్య కేసులో జైలుపాలైన మహిళలు
  • మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (ఏపీ) పార్టీ తరఫున నామినేషన్
  • కుటుంబ సభ్యుల ప్రచారంతో అత్యధిక మెజారిటీతో గెలుపు
హత్య కేసులో జైలుకు వెళ్లిన ఇద్దరు మహిళలు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం పూణెలో సంచలనంగా మారింది. లోకల్ గ్యాంగ్ స్టర్ బందు అందేకర్ బంధువులు, వరుసకు అత్తాకోడళ్లు అయిన సోనాలి, లక్ష్మి జైలు నుంచే అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేశారు. వారి తరఫున కుటుంబ సభ్యులు ప్రచారం చేయడంతో ఈ అత్తాకోడళ్లు ఘన విజయం సాధించారు. ఎన్నికల ముందు వీరికి టికెట్ ఇవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. హత్య కేసులో నిందితులకు టికెట్ ఎలా ఇచ్చారంటూ అజిత్ పవార్ పై ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. అయితే, ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.

తొలుత కొడుకు.. తర్వాత మనవడు..
గ్యాంగ్ స్టర్ బందు అందేకర్‌ మనవడు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బందు అందేకర్ కోడలు సోనాలి, మరదలు లక్ష్మి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. హత్యా నేరం కింద వారితో పాటు 16 మందిని అరెస్టు చేశారు. కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో వీరంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. కాగా, 2024 సెప్టెంబర్ లో బందు అందేకర్ కొడుకు, మాజీ కార్పొరేటర్‌ వనరాజ్‌ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా బందు అందేకర్‌ అల్లుడు గణేశ్‌ కోమ్కర్‌ ఈ హత్యకు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏడాది తర్వాత వనరాజ్ కొడుకు, బందు అందేకర్ మనవడు హత్యకు గురికావడం గమనార్హం.

More Telugu News