Paparao: ఎన్‌కౌంటర్‌లో కోటి రూపాయల రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి
- బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్
- ఇద్దరు మావోయిస్టుల హతం
- మృతుల్లో మావో నేత పాపారావు అలియాస్ మోంగు
మావోయిస్టు పార్టీకీ మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యూహకర్తగా పాపారావు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత మిగిలిన టాప్ లీడర్లలో ఒకరిగా పాపారావు కొనసాగుతున్నాడు.
పాపారావు కదలికలపై సమాచారం అందడంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించాడు. పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. ఘటన స్థలంలో ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది ఈ అడవుల్లోనే తప్పించుకున్న పాపారావు, ఇప్పుడు అదే ప్రాంతంలో మృతి చెందడం గమనార్హం.