Tamannaah: సౌత్ స్టార్ హీరో నన్ను అవమానించాడు: తమన్నా
- తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న తమన్నా
- తనను బోల్డ్ సీన్ చేయమని అడిగితే నిరాకరించానని వెల్లడి
- తనను మార్చేయాలని హీరో అవమానించాడన్న తమన్నా
తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతూ, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కథానాయికగా మాత్రమే కాకుండా, ఐటెం సాంగ్స్‌లోనూ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను ఓ బోల్డ్ సీన్ చేయమని అడిగారని, అందులో ఇంటిమసీ ఎక్కువగా ఉండటంతో తాను అసౌకర్యంగా భావించి నిరాకరించినట్లు చెప్పింది. ఆ విషయం సదరు సౌత్ స్టార్ హీరోకు నచ్చలేదని, సెట్‌లో అందరి ముందే తనపై అరిచి, హీరోయిన్‌ను మార్చేయాలని పేర్కొంటూ, అవమానించాడని తెలిపింది. ఆ సమయంలో తనకు తీవ్రంగా బాధ కలిగిందని తమన్నా వెల్లడించింది. అయితే ఆ హీరో తర్వాత తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు కూడా తెలిపింది. అయినా, ఆ హీరో ఎవరో మాత్రం చెప్పకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి, చర్చ మొదలయ్యాయి.