AR Rahman: బాలీవుడ్‌లో రెహమాన్ వ్యాఖ్యల దుమారం.. తిరిగి హిందువుగా మారాలన్న వీహెచ్‌పీ

AR Rahman Controversy VHP Calls for Return to Hinduism
  • బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడానికి మతతత్వం కారణమై ఉండొచ్చన్న ఏఆర్ రెహమాన్
  • రెహమాన్ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ తీవ్ర స్పందన
  • తిరిగి హిందూ మతంలోకి రావాలంటూ రెహమాన్‌కు సూచన
  • రెహమాన్ ఆరోపణలను ఖండించిన జావేద్ అక్తర్, పలువురు నిర్మాతలు
  • సంగీతం నాణ్యత తగ్గడం, అధిక ఫీజులే కారణమని కొందరి వాదన
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించారు.

ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని, దీనికి ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఒక కారణమైతే, 'మతతత్వం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయం తనకు నేరుగా ఎవరూ చెప్పకపోయినా, పుకార్ల రూపంలో తెలిసిందని పేర్కొన్నారు.

రెహమాన్ వ్యాఖ్యలను వినోద్ బన్సల్ తప్పుబట్టారు. "తనకు ఎందుకు పని దొరకడం లేదో ఆత్మపరిశీలన చేసుకోకుండా, మొత్తం పరిశ్రమ వ్యవస్థను నిందించడం సరికాదు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని కొందరు విభేదించారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తుచేశారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ నిర్మాత-దర్శకుడు కూడా రెహమాన్ వ్యాఖ్యలను 'చౌకబారు విమర్శ'గా కొట్టిపారేశారు. రెహమాన్ సంగీతంలో నాణ్యత తగ్గడం, అధిక ఫీజు డిమాండ్ చేయడం, ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాలు తగ్గాయని, అంతేకానీ మతపరమైన కోణం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది.
AR Rahman
Rahman
Bollywood
VHP
Hinduism
Vinod Bansal
Javed Akhtar
religious discrimination
Hindi film industry
music composer

More Telugu News