Sunpreeth Singh: టెక్నాలజీతో టోకరా.. భూ భారతి కేసును ఛేదించిన పోలీసులు

Telangana Bhu Bharati Scam Busted 15 Arrested
  • భూ భారతి, ధరణి పోర్టల్స్ స్కాంలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్లు గండి కొట్టినట్లు వెల్లడి
  • టెక్నికల్ లోపాలను వాడుకొని చలాన్లు మార్చి భారీ మోసం
  • నిందితుల నుంచి రూ.63 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం
  • పరారీలో ఉన్న మరో 9 మంది కోసం ప్రత్యేక బృందాల గాలింపు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘భూ భారతి’, ‘ధరణి’ పోర్టల్స్ ఆధారంగా జరిగిన భారీ భూ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో జనగామ పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా మోసాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల నష్టం వాటిల్లినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నడుపుతున్న పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. వీరు వెబ్ బ్రౌజర్‌లోని ‘ఇన్‌స్పెక్ట్ - ఎడిట్’ ఆప్షన్‌ను ఉపయోగించి ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చలాన్ల మొత్తాన్ని మార్చేసేవారు. భూ యజమానుల నుంచి పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం ఎడిట్ చేసిన తక్కువ మొత్తాన్ని చెల్లించి, మిగిలిన డబ్బును కాజేశారు. ఈ విధంగా మొత్తం 1,080 డాక్యుమెంట్లను మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది.

ఈ కేసు వివరాలను శుక్రవారం సున్‌ప్రీత్ సింగ్ మీడియాకు వివరిస్తూ "ప్రధాన నిందితులను బసవరాజు, జెల్లా పాండుగా గుర్తించాం. వీరి నుంచి రూ.63.19 లక్షల నగదు, రూ. కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ. లక్ష సీజ్‌ చేశాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి" అని తెలిపారు.

ఈ స్కామ్‌కు సంబంధించి జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొత్తం 22 కేసులు నమోదు చేశారు. మొదట ఈ మోసంపై ఫిర్యాదు చేసిన శ్రీనాథ్‌కు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అరెస్టు చేయడం గమనార్హం. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
Sunpreeth Singh
Bhu Bharati
Dharani portal
land registration scam
Telangana
Janagaon police
cybercrime
online service centers
Pasunuri Basavaraju
Jella Pandu

More Telugu News