Himanta Biswa Sarma: జుబిన్ గార్గ్ మృతి కేసు... సింగపూర్ పోలీసుల కంటే మా పోలీసులే బెటర్: సీఎం బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు

Himanta Biswa Sarma on Zubeen Garg Death Case Assam Police Better Than Singapore Police
  • జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ దర్యాప్తు కంటే తమ దర్యాప్తే ఉత్తమం అన్న అసోం సీఎం
  • ఈ కేసులో నలుగురిపై హత్య కేసు పెట్టి జైలుకు పంపామని వెల్లడి
  • వారికి ఇప్పటికీ బెయిల్ లభించలేదని వ్యాఖ్యలు
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసు దర్యాప్తుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ పోలీసుల కన్నా తమ రాష్ట్ర పోలీసులే మెరుగైన దర్యాప్తు చేశారని, అందుకే నిందితులు జైలులో ఉన్నారని శుక్రవారం ఆయన అన్నారు.

హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ, "జుబీన్ గార్గ్ మృతిలో సింగపూర్ పోలీసులు ఎలాంటి కుట్ర కోణాన్ని కనుగొనలేకపోయారు. కానీ, మేం నలుగురిపై హత్య అభియోగాలు మోపి జైలుకు పంపాం. వారికి ఇప్పటికీ బెయిల్ లభించలేదు. ఇది అసోం పోలీసుల విజయం. సింగపూర్ పోలీసుల కన్నా మా బృందం అద్భుతంగా దర్యాప్తు చేసింది" అని పేర్కొన్నారు. ఈ కేసులో సరైన విచారణ జరిపినందుకు ప్రజలు తమ ప్రభుత్వాన్ని అభినందించాలని ఆయన కోరారు.

మరోవైపు, సింగపూర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. ప్రమాదం జరగడానికి ముందు జుబీన్ గార్గ్ పడవపై తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. అతను జిన్, విస్కీతో పాటు పలు రకాల ఆల్కహాల్ సేవించినట్లు సాక్షులు చెప్పారని పేర్కొన్నారు. అతనికి హైపర్‌టెన్షన్, మూర్ఛ వ్యాధి ఉన్నట్లు కూడా విచారణలో తేలింది.

బోట్ కెప్టెన్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం, గార్గ్ సరిగ్గా నడవలేని స్థితిలో ఉండటంతో ఇద్దరు స్నేహితులు పట్టుకుని పడవ ఎక్కించారు. మొదట ఈతకు వెళ్లి తిరిగి వచ్చిన గార్గ్, అలసిపోయానని చెప్పి మళ్లీ లైఫ్ జాకెట్ లేకుండా నీటిలోకి వెళ్లాడు. అతను మద్యం మత్తులో ఉన్నందున అలా వెళ్లొద్దని అతని స్నేహితుడిని హెచ్చరించినట్లు కెప్టెన్ చెప్పారు. గార్గ్ నీటిలో ముఖం పెట్టి తేలుతుండటం గమనించి, తానే నీటిలోకి దూకినట్లు కెప్టెన్ వివరించారు. సాక్ష్యాధారాల ప్రకారం అతను స్వచ్ఛందంగానే నీటిలోకి వెళ్లాడని, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం కనిపించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Himanta Biswa Sarma
Zubeen Garg death case
Assam police
Singapore police
investigation
alcohol
drowning
Assam CM
crime
murder

More Telugu News