APSRTC: ప్రారంభమైన సంక్రాంతి తిరుగు ప్రయాణాలు... ఏపీలో ప్రధాన బస్టాండ్లలో పెరిగిన రద్దీ

Sankranti Return Journeys Begin Rush Increased at Major Bus Stands in AP
  • ముగిసిన మూడు రోజుల సంక్రాంతి సంబరాలు 
  • సొంతూళ్ల నుంచి నగరాలకు ప్రజల తిరుగు ప్రయాణం 
  • ఏపీ వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట
  • రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు 
  • సోమవారం వరకు ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం 
మూడు రోజుల పాటు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం కనుమ పండుగతో ఘనంగా ముగిశాయి. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరాలకు పయనమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

భోగి మంటలతో ప్రారంభమైన వేడుకల కోసం ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరపడిన వారంతా పల్లెలకు, పట్నాలకు చేరుకున్నారు. బంధుమిత్రుల రాకతో ఇన్నాళ్లూ కళకళలాడిన పల్లెలు ఈ సాయంత్రం నుంచి క్రమంగా ఖాళీ అవుతున్నాయి. పండుగ సెలవులు ముగియడంతో అందరూ తిరుగు ప్రయాణాలు కట్టారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రధాన నగరాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. రైళ్లలోనూ సాధారణ బోగీల నుంచి రిజర్వేషన్ బోగీల వరకు ఎక్కడా ఖాళీ కనిపించడం లేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
APSRTC
Sankranti
APSRTC buses
railway stations
special trains
Andhra Pradesh
Hyderabad
Bengaluru
Chennai
festival rush

More Telugu News