మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు... ఆ మున్సిపాలిటీలో బీజేపీకి చేదు అనుభవం

  • లాతూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం
  • 70 స్థానాలకు గాను 43 చోట్ల కాంగ్రెస్ గెలుపు
  • విలాస్‌రావు దేశ్‌ముఖ్‌పై అధ్యక్షుడి వ్యాఖ్యలతో దెబ్బతిన్న బీజేపీ
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ప్రాంతాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ, లాతూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 70 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ సత్తా చాటుతున్నప్పటికీ, లాతూర్‌లో ఆ పార్టీ పరాభవానికి ఒక ప్రత్యేక కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌పై ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన విమర్శలు ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికలకు ముందు లాతూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్, విలాస్‌రావు స్వస్థలమైన ఈ ప్రాంతంలో ఆయన జ్ఞాపకాలను తుడిచివేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నాయకుడిని బీజేపీ కించపరిచే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విలాస్‌రావు తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, సామాన్యుల హృదయాల నుంచి తన తండ్రి జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవీంద్ర చవాన్ వెనక్కి తగ్గి రితేశ్ దేశ్‌ముఖ్‌కు క్షమాపణలు చెప్పారు. తాను విలాస్‌రావును విమర్శించలేదని వివరణ ఇచ్చారు.


More Telugu News