Dharmapuri Arvind: నిజాం ఒక హంతకుడు: ధర్మపురి అర్వింద్

Dharmapuri Arvind calls Nizam a murderer
  • నిజాం పేరును నిజామాబాద్ కు ఎందుకు పెట్టుకుంటారన్న అర్వింద్
  • నిజామాబాద్ ను ఇందూర్ గా పిలవాలని డిమాండ్
  • నిజాం ఎప్పటికీ దుర్మార్గుడిగానే మిగిలిపోతాడని వ్యాఖ్య

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... శ్రీరాముడికీ బీజేపీ మెంబర్‌షిప్ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను ఉద్దేశించి అన్నారు.


నిజామాబాద్‌ను ‘ఇందూర్’గా పిలవాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక హంతకుడని, అలాంటి వ్యక్తి పేరును నిజామాబాద్ కు ఎందుకు పెట్టుకుంటారని అన్నారు. ఇందూర్ అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ పేరు మార్చి ఇందూర్‌గా చేయాలని తీర్మానం చేసి, ఏబీవీపీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు.


ముస్లింలంటే కాంగ్రెస్ అన్నట్టు మాట్లాడటం సరికాదని విమర్శించారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ... అక్కడ హిందువులా, ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంతమంది హిందువుల్లో కూడా చెడు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం త్వరలో కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


బీజేపీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కవితను అడిగితే చెబుతుందని ఎద్దేవా చేశారు. రేపు సిరిసిల్లలో కూడా బీజేపీ బలాన్ని చూపిస్తామని చెప్పారు. ఇందూర్‌కి దమ్ముంటే రా అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.


గతంలో కాంగ్రెస్ పాలనలోనే మత ఘర్షణలు జరిగాయని అర్వింద్ ఆరోపించారు. చెన్నారెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో అల్లర్లు జరిగాయని తెలిపారు. అప్పట్లో ఏసీపీ సత్తయ్య హత్య కేసులో నిందితులను బయటకు తీసుకొచ్చింది మజ్లిస్‌ పార్టీయేనని ఆరోపించారు. తిన్న తిండి అరగక హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డేనని విమర్శించారు.


నిజాంను గాడిద అని అన్నందుకే రాద్ధాంతం చేస్తున్నారని, కానీ చరిత్రలో నిజాం ఎప్పటికీ దుర్మార్గమైన రాజుగానే మిగిలిపోతాడని అన్నారు. ఆయన పేరు వినగానే హిందువులకు గుర్తొచ్చేది ఆయన చేసిన మారణకాండేనని పేర్కొన్నారు. ముస్లింలకు ఇళ్లు, రేషన్, ఉచిత వ్యాక్సినేషన్ మోదీ ప్రభుత్వం ఇస్తోందని... ముస్లిం దేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపించిందని తెలిపారు.

Dharmapuri Arvind
Nizamabad
Indur
Revanth Reddy
KTR
BJP Telangana
Telangana Politics
Nizam
TPCC Mahesh Goud
Sirisilla

More Telugu News