Indian Navikulu: ఇరాన్‌ చెరలో 16 మంది భారత నావికులు.. కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

Indian Navikulu 16 Indian Sailors Detained in Iran Families Appeal to Government
  • నౌకలో స్మగ్లింగ్ జరుగుతోందనే అనుమానంతో నౌకను అదుపులోకి తీసుకున్న ఇరాన్
  • మొత్తం 18 మంది నావికులను అదుపులోకి తీసుకున్న ఇరాన్ నావికాదళం
  • అందులో 16 మంది భారతీయులు ఉండటంతో కుటుంబ సభ్యుల ఆందోళన
ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని భారత నావికుల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. గత నెలలో భారత్‌కు చెందిన 16 మంది నావికులు ఇరాన్‌లో చిక్కుకుపోగా, అక్కడి భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో నావికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో, తమ వారిని సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి, తమ వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకు రావాలని నౌక కెప్టెన్ ఖేతన్ మెహతా అనే ఇంజినీర్ తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల రోజులకు పైగా ఇరాన్ చెరలో ఉన్న తమ వారికి సరైన వైద్య, న్యాయ, ఆర్థిక సహాయం అందించేలా చూడాలని వారు కోరారు.

మరోవైపు, నావికుల కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం స్టేటస్ రిపోర్టును అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

వివిధ కారణాల వల్ల 16 మంది నావికులతో కూడిన భారతీయ నౌకను ఇరాన్ నావికులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈలోని దిబ్బా పోర్టు సమీపంలో అంతర్జాతీయ జలాల్లో వెళుతున్న వాలియంట్ రోర్ అనే నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గత సంవత్సరం డిసెంబర్ 8న వెంబడించారు. ఆ నౌకలో 6 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం స్మగ్లింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ సిబ్బందిని నిర్బంధించారు.

ఆ సమయంలో నౌకలో 18 మంది నావికులు ఉండగా, అందులో 16 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పదిమందిని జైలుకు తీసుకువెళ్లగా, మిగతా వారు ఇరాన్ గార్డుల నిఘాలో నౌకలోనే ఉన్నట్లు సమాచారం. ఈ నావికులందరూ ఏ దేశంలోని నౌకల్లో అయినా పని చేసే లైసెన్స్ కలిగిన వారు కావడం గమనార్హం.
Indian Navikulu
Iran
Indian sailors
Valiant Roar
Delhi High Court
UAE Dibba Port
Iran Revolutionary Guards

More Telugu News