Priya Kapoor: రూ. 30 వేల కోట్ల వారసత్వ యుద్ధం: సుప్రీంకోర్టు మెట్లెక్కిన ప్రియా కపూర్

Priya Kapoor approaches Supreme Court in 30000 crore inheritance battle
  • కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ పాత విడాకుల పత్రాలు కావాలని పిటిషన్
  • సంజయ్ వీలునామా 'ఫోర్జరీ' అన్న కరిష్మా పిల్లలు
  • ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ విచారణకు డిమాండ్
ప్రముఖ పారిశ్రామికవేత్త, సోనా కామ్‌స్టార్ మాజీ ఛైర్మన్ దివంగత సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ. 30,000 కోట్ల భారీ సామ్రాజ్యం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఆయన మూడో భార్య ప్రియా కపూర్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016లో నటి కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌ల మధ్య జరిగిన విడాకుల కేసులోని గోప్యమైన పత్రాలు, సెటిల్‌మెంట్ ఒప్పందాలు తనకు కావాలని ఆమె కోరారు. ఆ విడాకుల సమయంలో పిల్లల భవిష్యత్తు కోసం సంజయ్ ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడమే తన ఉద్దేశమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతేడాది జూన్‌లో సంజయ్ కపూర్ బ్రిటన్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత బయటపడిన ఒక వీలునామా ఈ వివాదానికి కేంద్రబిందువైంది. ఈ వీలునామా ప్రకారం సంజయ్ తన మొత్తం ఆస్తిని భార్య ప్రియా కపూర్‌కే రాసిచ్చారు. అయితే, దీనిపై కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీలునామా పూర్తిగా 'ఫోర్జరీ' చేయబడిందని, తన తండ్రి సంతకం అందులో లేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది.

ఈ వివాదం సివిల్ కేసు నుంచి క్రిమినల్ కేసుగా మారుతోంది. ప్రియా కపూర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీకి పాల్పడిన ఆమెను శిక్షించాలని కరిష్మా పిల్లలు కోర్టును కోరారు. వీలునామాలో ఉన్న తప్పులు (సమైరా, కియాన్‌ల పేర్ల స్పెల్లింగ్స్ తప్పుగా ఉండటం వంటివి) సంజయ్ లాంటి చదువుకున్న వ్యక్తి చేసే అవకాశం లేదని వారు వాదిస్తున్నారు. మరోవైపు, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కూడా తన మనవళ్లకే మద్దతు పలకడం విశేషం. తన కుమారుడు తనను, తన మనవళ్లను ఆస్తి నుంచి పూర్తిగా దూరం పెట్టాడనే విషయాన్ని ఆమె నమ్మలేకపోతున్నారు.

అయితే ఈ ఆరోపణలను ప్రియా కపూర్ ఖండిస్తున్నారు. సంజయ్ మరణం తర్వాత పిల్లల విలాసవంతమైన జీవనశైలి కోసం తాను రూ. 96 లక్షల వరకు ఖర్చు చేశానని ఆమె కోర్టుకు తెలిపారు. స్పెల్లింగ్ తప్పులు ఉన్నంత మాత్రాన వీలునామా ఫోర్జరీ అని చెప్పలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఓపక్క హైకోర్టులోనూ, మరోపక్క సుప్రీంకోర్టులోనూ విచారణ కొనసాగుతోంది. 30 వేల కోట్ల సామ్రాజ్యం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. 
Priya Kapoor
Sanjay Kapur
Karishma Kapoor
inheritance dispute
will forgery
Supreme Court
property dispute
Samaira Kapoor
Kiaan Kapoor
Rani Kapoor

More Telugu News