ఇజ్రాయెల్‌లో భారతీయులకు 'హై అలర్ట్': అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
- ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు
- ఇజ్రాయెల్‌లో భారత ఎంబసీ కీలక హెచ్చరిక
- అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచన
- 24x7 హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం సుమారు 40 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అక్కడ ఉన్నవారు అనవసరంగా బయట తిరగవద్దని ఎంబసీ కోరింది. అమెరికా, బ్రిటన్ దేశాలు కూడా ఇప్పటికే తమ పౌరులకు ఇవే తరహా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
మరోవైపు, ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు, అమెరికా సైనిక చర్య ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న 10 వేల మంది భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులు, పర్యాటకులు తక్షణమే వాణిజ్య విమానాల ద్వారా దేశం విడిచి రావాలని సూచించింది. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సంప్రదించడానికి +972-54-7520711 వంటి ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ఎంబసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని అధికారులు సూచించారు.