Nazmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కీలక పరిణామం... ఆటగాళ్ల డిమాండ్‌తో ఆ అధికారి తొలగింపు

Nazmul Islam Removed from BCB Finance Committee After Player Demands
  • ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేసిన నజ్ముల్ ఇస్లాం
  • నజ్ముల్‌ను తొలగించే వరకు ఆడబోమన్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు
  • ఆటగాళ్ళ డిమాండ్‌తో నజ్ముల్‌ను కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. బీసీబీ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న నజ్ముల్ ఇస్లాంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నజ్ముల్ ఇస్లాం బుధవారం నాడు ఆటగాళ్ల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి. దీంతో నజ్ముల్ రాజీనామా చేయాలంటూ ఆటగాళ్లు పట్టుబట్టారు.

నజ్ముల్ రాజీనామా చేయని పక్షంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరించింది.

దీనిపై స్పందించిన బీసీబీ, నజ్ముల్ ఇస్లాంకు నోటీసు జారీ చేసింది. అయితే, నజ్ముల్ రాజీనామా చేసే వరకు తమ నిరసన విరమించేది లేదని ఆటగాళ్లు తేల్చిచెప్పారు. ఆటగాళ్ల డిమాండ్‌కు తలొగ్గిన బీసీబీ అతడిని పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈరోజు బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మొదటి మ్యాచ్‌లో చటోగ్రామ్ రాయల్స్, నోఖాలి ఎక్స్‌ప్రెస్ జట్లు తలపడాల్సి ఉండగా, టాస్ సమయానికి రెండు జట్లు హాజరు కాలేదు.

2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడకపోతే బీసీబీకి ఎలాంటి నష్టం వాటిల్లదని, క్రికెటర్లకు మాత్రమే నష్టం జరుగుతుందని నజ్ముల్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ టోర్నీలలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదని, ఆటగాళ్లు సరిగ్గా ఆడనప్పుడల్లా డబ్బులు తిరిగి అడుగుదామని నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బంగ్లా ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nazmul Islam
Bangladesh Cricket Board
BCB
Bangladesh Premier League
BPL
Bangladesh Cricket Welfare Association

More Telugu News