Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా 'సంక్రాంతి అల్పాహార విందు'

Annapurna Studios Celebrates Sankranti Feast Tradition
  • అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక
  • ఏఎన్నార్ ప్రారంభించిన 'సంక్రాంతి అల్పాహార' విందు 50 ఏళ్లుగా కొనసాగింపు
  • కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా వడ్డించిన నాగార్జున, కుటుంబ సభ్యులు
  • తండ్రి ఆశయాలను గౌరవంగా ముందుకు తీసుకెళుతున్న అక్కినేని వారసులు
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించిన 'సంక్రాంతి అల్పాహార విందు'ను హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంప్రదాయం 50వ వసంతంలోకి అడుగుపెట్టడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

ఐదు దశాబ్దాల క్రితం, తన సంస్థ పురోగతికి మూలస్తంభాలైన కార్మికుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు ఏఎన్నార్ సంక్రాంతి రోజున ఈ విందును ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణాన్ని పండగ శోభ ఉట్టిపడేలా అద్భుతంగా అలంకరించారు. అయితే, ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి భిన్నంగా ఈసారి సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి వేడుకను మరింత ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యజమానులమనే భావన లేకుండా, వారంతా స్వయంగా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాన్ని వడ్డించారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. యజమాని, పనివారు అనే తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఏఎన్నార్ గొప్ప ఆశయాన్ని ఆయన వారసులు సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ దృశ్యాలు నిరూపించాయి. ఈ సందర్భంగా స్టూడియో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 
Annapurna Studios
Akkineni Nageswara Rao
Sankranti festival
Annapurna Studios Sankranti
Akkineni Nagarjuna
Hyderabad events
Telugu traditions
Telugu cinema
ANR legacy

More Telugu News