Talasani Srinivas Yadav: పేరు మార్పుతో సికింద్రాబాద్ ఆనవాళ్లు తుడిచిపెట్టే ప్రయత్నం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav Condemns Secunderabad Name Change Attempt
  • ఆనవాళ్లు తుడిచేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణ
  • సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • ఈ నెల 17న 'బచావో సికింద్రాబాద్' పేరిట శాంతి ర్యాలీ
సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఆనవాళ్లను తుడిచివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 'బచావో సికింద్రాబాద్' పేరుతో ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ర్యాలీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని ఈ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా పాల్గొని ఈ శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, సికింద్రాబాద్ పేరును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, కాబట్టి ఈ పేరును మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని వారు చెబుతున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు పోతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పేర్ల మార్పుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని వారు ఆరోపిస్తున్నారు.
Talasani Srinivas Yadav
Secunderabad
Revanth Reddy
BRS Party
Telangana
Name Change
Bachao Secunderabad

More Telugu News